టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారని, కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం పాలయ్యారన్నారు మంత్రి పెద్దిరెడ్డి. అవన్నీ గమనించి పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కవని చంద్రబాబు ఆలోచనలో పడ్డారన్న పెద్దిరెడ్డి.. అందుకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్నికల్లో గెలవలేం.. ఓడిపోతామని ఏ నాయకుడు చెప్పడని.. అందుకే చంద్రబాబు వాళ్ల కార్యకర్తలకు గెలుపుపై భరోసా ఇస్తున్నారని మంత్రి అన్నారు. అసలు ఏం చేశారని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేయాలని, కేవలం సీఎం జగన్, వైసీపీని తిట్టడమే టీడీపీ ఎన్నికల నినాదంగా, అజెండాగా కనిపిస్తోందన్నారు. దానికి పచ్చ మీడియా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేసినా చేయకపోయినా నైతికంగా ఆయన ఓడినట్లేనని మంత్రి పెద్దిరెడ్డి చురకలు అంటించారు.