ధరలు మండిపోతున్నాయి. పెట్రో, డీజిల్ ధరలు ఓ వైపు, వంట నూనెలు మరో వైపు ఇంకా ఆలోచిస్తే అన్ని వస్తువుల ధరలూ పెరగడంతో మార్కెట్ శక్తులు నేల విడిచి సాము చేస్తున్నాయి. ధరల నియంత్రణకు మునుపెన్నడూ లేని విధంగా స్థానిక ప్రభుత్వాలు చొరవ చూపించడం లేదు. కేంద్రం చొరవ చూపి ఓ దారికి తెస్తున్నా స్థానిక మార్కెట్ల చొరవ మాత్రం పెద్దగా లేదు.
పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయి మరి! వెనువెంటనే సిమెంట్ ధర తగ్గాలి కానీ ఇంకా తగ్గలేదు. దీంతో నిర్మాణ రంగంకు ఉత్సాహం లేకుండా ఉంది. వీలున్నంత వరకూ స్థానిక మార్కెట్లు కూడా సహకరిస్తేనే కేంద్రం చేపట్టే చర్యలు సత్ఫలితాలు ఇస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహాలూ లేవు.
వాస్తవానికి దేశ ప్రజలకు మోడీ కొన్ని వరాలు ఇస్తున్నారు. ధరల తగ్గుదలకు ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నారు. అయితే వీటి ఫలాలు ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు అన్నది ఓ వాస్తవం. ఇప్పటిదాకా నిత్యావసర ధరలు ఓ స్థాయి దాటి వెళ్లాయి. అయితే ధరల కట్టడికి మోడీ కొన్ని చర్యలు చేపట్టి కొంత వరకూ సఫలీకృతం అయ్యారు. పెట్రో ధరల తగ్గింపునకు సంబంధించి చేసిన ఉపశమన చర్య కాస్త మంచి ఫలితమే ఇచ్చింది. అయితే రాష్ట్రాలు కూడా దిగి రావాలి. కానీ రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గించేందుకు పెద్దగా అనుకూలంగా లేవు. దాంతో పెట్రో ధరలకు సంబంధించి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా, రాష్ట్రాల చర్యలు మాత్రం ఆశించిన విధంగా లేవు. ఇక పెట్రో ధరలు తగ్గితే సిమెంట్ ధరలు సంబంధిత రవాణా ధరలు కూడా తగ్గుతాయి.
ఆ విధంగా చూసుకుంటే త్వరలోనే సిమెంట్ రేట్లు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు నెలకు ఒక్కో సిలిండర్ పై 200 రూపాయలు తగ్గించేందుకు మోడీ ముందుకు వచ్చారు. ఇక మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోవడం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కూడా తీవ్ర ప్రభావం చూపడం తదితర కారణాల రీత్యా ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా 20 లక్షల టన్నుల క్రూడ్ సోయాబీన్ , సన్ ఫ్లవర్ ఆయిల్ మన మార్కెట్లకు చేరుకునేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
అదేవిధంగా ఎరువులకు సంబంధించి సబ్సిడీని పెంచింది. అదనంగా లక్షా పది వేల కోట్ల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి ఎరువల సబ్సిడీ రెండు లక్షల కోట్లకు పైగా కేంద్రం భరించనుంది. ఓ విధంగా రైతాంగానికి ఎంతో ఉపశమనం ఇచ్చే చర్య ఇది అని సంబంధిత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తీసుకున్న ఉపశమన చర్యలు సత్ఫలితాలు ఇస్తే ఇకపై సామాన్యులపై ధరాభారం తగ్గేందుకు అవకాశాలుంటాయి. మార్కెట్ శక్తులు కూడా దిగివచ్చి ధరల తగ్గుదలపై దృష్టి సారిస్తే మేలు.