ఏపీలోని మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పరిధిలోని కార్యక్రమాలు, ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు, కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్ కేర్ తదితర అంశాలపై సీఎం జగన్ ఈ సమీక్షలో చర్చించారు. ఏ తరహా ప్రసవం జరిగినా ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5 వేలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. సహజ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆరోగ్య ఆసరా వర్తింపజేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్. అయితే సహజ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఈ దిశగా అవగాహన, చైతన్యం పెంచాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు సీఎం జగన్.
ఆరోగ్యశ్రీ పథకం కిందకు మరిన్ని చికిత్సలు తీసుకురావాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ, ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 2,446 రకాల చికిత్సలు అమల్లో ఉన్నాయని సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీ కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, గత సంవత్సరం ఆయుష్మాన్ భారత్ కింద ఏపీకి రూ.223 కోట్లు వచ్చాయని, ఈ సంవత్సరం రూ.360 కోట్లు రావొచ్చని సీఎం జగన్కు అధికారులు వివరించారు.