ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గులాబీ గూటిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కార్ ఎక్కడంతో కొల్లాపూర్ టిఆర్ఎస్ లో అగ్గి రాజుకుంది. తాజా, మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఐక్యత కుదరడం లేదు.
దీనికి తోడు నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటంతో పార్టీలో ఐక్యత లేదనే అంశం స్పష్టమవుతోంది. అయితే ఈ అంశంపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ లోని జూపల్లి నివాసానికి వెళ్లినట్లు సమాచారం. కొల్లాపూర్ లో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో జూపల్లిని కేటీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితి, నెలకొన్న గ్రూపు రాజకీయాలపై జూపల్లి తో మంత్రి కేటీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.