సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా ఈ రోజు వేకువజామున కన్నుమూశారు. సాధనా గుప్తా చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు సాధనా గుప్తా. ఊపిరితిత్తుల వ్యాధి ముదరడంతో సాధనా గుప్తాను నాలుగు రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. తొలుత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. దాంతో ఆమెను ఐసీయూకి తరలించారు. సాధనా గుప్తాను ములాయం సింగ్ యాదవ్ రెండో పెళ్లి చేసుకున్నారు.
అప్పటికే ఆయనకు మొదటి భార్య మాలతి దేవి (అఖిలేశ్ యాదవ్ తల్లి) ఉన్నారు. మాలతి దేవి 2003లో కన్నుమూశారు. ములాయంకు, సాధనా గుప్తాకు మధ్య 20 ఏళ్ల అంతరం ఉంది. సాధనా గుప్తాకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నారు. సాధనా గుప్తా కోడలు అపర్ణా యాదవ్ బీజేపీ నేత. కాగా, సాధనాగుప్తా మృతి విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ట్వీట్ చేయగా, అఖిలేశ్ యాదవ్ రీట్వీట్ చేశారు. సాధనా గుప్తా మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలియజేశారు. వీరితో పాటు రాజకీయ ప్రముఖులు సాధనా గుప్తా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.