అసలే కొడాలి నాని దెబ్బకు గుడివాడలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది…సరే ఎలాగోలా పార్టీని లేపుదామని కార్యకర్తలు పనిచేస్తున్నారు…కానీ ఇంతలో గుడివాడ నేతలు రగడ మొదలుపెట్టారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. ఇటీవల గుడివాడలో మహానాడు జరుగుతుందనే నేపథ్యంలో నేతలంతా ఒక్కసారిగా బయటకొచ్చారు.
ఇప్పటివరకు అడ్రెస్ లేని నేతలు తెరపైకి వచ్చారు…ఎవరికి వారు సెపరేట్ గా ఫ్లెక్సీలు కట్టేశారు. రావి వెంకటేశ్వరరావు, శిష్ట్లా లోహిత్, పిన్నమనేని బాబ్జీ లాంటి వారు గ్రూపులుగా ఏర్పడి రాజకీయం చేశారు. ఇలా ఒక్కసారిగా గుడివాడ టీడీపీలో గ్రూపు రాజకీయం మొదలైంది. ఇదే సమయంలో చివరి నిమిషంలో వర్షం కారణంగా మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. అయితే గుడివాడలో గ్రూపు గొడవలు పెరిగాయి.
దీంతో ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరావు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు..ఈ క్రమంలోనే యనమల రామకృష్ణుడు, టీడీ జనార్ధన్ లు గుడివాడ నేతలతో సమావేశమయ్యారు. రావి, పిన్నమమేని వెంకటేశ్వరావు, పిన్నమనేని బాబ్జీ, లోహిత్ లతో సమావేశమై..అందరూ కలిసి పనిచేసి కొడాలికి చెక్ పెట్టాలని సూచించారు. అయితే రావి…తమని కలుపుకు వెళ్ళడం లేదని ఇతర నేతలు ఫిర్యాదు చేశారు.
ఇదే క్రమంలో సీటు విషయంలో కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారని రావి వర్గం చెప్పుకొచ్చింది. దీంతో రావికే దాదాపు సీటు వస్తుందని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. అలాగే ఇతర నేతలని కలుపుకుని వెళ్ళి…గుడివాడలో టీడీపీని మళ్ళీ గాడిలో పెట్టాలని సూచించినట్లు తెలిసింది. అంటే గుడివాడ సీటు దాదాపు రావికి ఫిక్స్ అయిందని ప్రచారం జరిగింది..అలాగే గుడివాడలో జరిగే టీడీపీ కార్యక్రమాలు రావి చేస్తేనే పరిగణలోకి తీసుకుంటామని అధిష్టానం ఇతర నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
అంటే ఇప్పుడు గుడివాడలో రావినే టీడీపీ అభ్యర్ధి…అయితే చివరి నిమిషంలో సర్వేలు ఆధారంగా అభ్యర్ధిని మార్చిన ఆశ్చర్యపోనవసరం లేదు…ఎందుకంటే గత ఎన్నికల్లో అలాగే చేశారు. చివరి నిమిషంలో దేవినేని అవినాష్ ని తీసుకొచ్చి పెట్టారు. మరి చూడాలి రావినే బరిలో దింపుతారో లేక నానిపై కొత్త ప్రత్యర్ధిని పెడతారో.