వరకట్నం వేధింపులకు మరో మహిళ బలి

-

వరకట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


గచ్చిబౌలి ఠాణా ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన ప్రకారం.. కొండకరకం గ్రామానికి చెందిన జి.సునీత (23)కు ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న అదే ప్రాంతానికి చెందిన ఆర్‌.రమేష్‌తో 2019 మే 17న వివాహమైంది. హైదరాబాద్‌కు బదిలీ కావడంతో గచ్చిబౌలి సుదర్శన్‌గర్‌లోని మెజిస్టిక్‌ ప్లజెంట్‌ హోమ్స్‌ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు.

గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి పడక గదిలో సునీత ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.

అందిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
వివాహ సమయంలో 5 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు, 20 సెంట్ల భూమి కట్నం కింద ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం అల్లుడు, అతని తల్లిదండ్రులు తమ కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధించారని బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కారు కొనుగోలుకు అదనంగా పది లక్షలు తీసుకురావాలంటూ నెల రోజులుగా అత్తింటివారి వేధింపులు అధికం కావడంతోనే సునీత ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త, అతని కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news