దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు కుటుంబసభ్యులు, ఇతర ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఉమామహేశ్వరి కుటుంబసభ్యులు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కల్యాణ్‌రామ్ తదితరులు ఆమెకు నివాళులర్పించారు. తెరాస నేత, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి తదితరులు ఉమామహేశ్వరి భౌతికకాయం వద్ద నివాళులర్పించి ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తమకు అభిమానమని.. ఆయన కుమార్తె మరణం బాధాకరమన్నారు. ఉమామహేశ్వరి మృతిపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని ఎర్రబెల్లి చెప్పారు.
ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆమె ఇంటికి వెళ్లారు. నందమూరి కల్యాణ్ రామ్ అక్కడికి చేరుకున్నారు. ఉమామహేశ్వరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తెకు ఇటీవలే వివాహం జరిగింది. పెద్ద కుమార్తె విశాల.. అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరిగే అవకాశం ఉంది.