తెలంగాణను వర్షాలు వీడనుంటున్నాయి. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ మరోసారి సూచనలు చేసింది.. రాష్ట్రంలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీనికి తోడు రుతుపవన ద్రోణి బికనీర్, కోటా, రైసెస్, రాయపూర్, దిఘాల మీదుగా ఆగ్నేయంగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళుతూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆవర్తనం ఏపీలోని ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీనికి తోడుగా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి.
దీని ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఈనెల9 వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది వాతావరణ శాఖ. ఈ మేరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, సిద్దిపేట, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. కాగా ఈ నెల 8,9 తేదీలలో పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయని వాతావరణ శాఖ పేర్కొంది.