ఆ ప్లాంట్‌ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్‌

-

జపరోషియా అణు విద్యుత్‌ కేంద్రం పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలని ఉక్రెయిన్‌ తాజాగా డిమాండ్‌ చేసింది. ఐరోపా ఖండంలోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన ఈ ప్లాంట్‌.. ఇటీవల రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక్కడ మాస్కో సేనల కార్యకలాపాలు అణు ప్రమాదానికి దారితీస్తాయన్న భయాందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్లాంట్‌ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.

‘అణు కేంద్రం నుంచి ఆక్రమిత బలగాలను తొలగించడంతోపాటు ఈ ప్రాంతంలో డీమిలిటరైజ్డ్ జోన్‌ ఏర్పాటు చేయాలి’ అని ఉక్రెయిన్ అణుశక్తి సంస్థ ‘ఎనర్‌గోతమ్’ అధ్యక్షుడు పెట్రో కోటిన్ కోరారు. ప్లాంట్‌వద్ద రేడియేషన్‌ ప్రమాదం, అణు విపత్తు ముప్పు పొంచి ఉన్నాయని హెచ్చరించారు.

ఐరాస(UN)కు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(IAEA) సైతం ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. జపరోషియా వద్ద రష్యా దాదాపు 500 మంది సైనికులను మోహరించిందని కోటిన్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ‘ఐఏఈఏతోపాటు ఇతర భద్రతా సంస్థల నిపుణులతో శాంతి పరిరక్షక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ప్లాంట్‌ నియంత్రణ బాధ్యతలు తొలుత వారికే అప్పగించాలి. ఆపై ఉక్రెయిన్‌ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ బలగాలే దాడులకు పాల్పడ్డాయని క్రెమ్లిన్ సోమవారం ఆరోపించింది. ఇది అత్యంత ప్రమాదకర చర్య అని, ఐరోపాకు విపత్తు పొంచి ఉందని హెచ్చరించింది. ఇటువంటి దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ మిత్రదేశాలు ఆ దేశంపై తమ పలుకుబడిని ఉపయోగించాలని పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news