తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కమ్యూనిస్టు పార్టీలను ఎర్రగులాబీలుగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే చిల్లర పెంకులకు ఆశపడి టీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారని హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని… ఆ పార్టీ నేతలే బహిరంగంగానే కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు బండి సంజయ్. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ లోపాయికారీ ఒప్పందంతో కలిసే పోటీ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. టీఆర్ఎస్ నియంత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ గెలుపుతో కేసీఆర్ అహంకారాన్ని అణగదొక్కాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశారని అందుకే ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్.
ఈనెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్న మునుగోడులో బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్. అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బండి సంజయ్ కోరారు. తెలంగాణ పదాధికారులు, ముఖ్య నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ‘అవినీతి, నియంతృత్వ, కుటుంబ’ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభలో ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా’ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వివరించారు. అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారన్నారు బండి సంజయ్.