తెలంగాణలో బాబు స్కెచ్..మునుగోడుతోనే?

-

మళ్ళీ తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకాలం కేసీఆర్ దెబ్బకు దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ఉన్న టీడీపీని బ్రతికించాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2019లో ఏపీలో కూడా దారుణంగా ఓడిపోయాక చంద్రబాబు..తెలంగాణని పూర్తిగా వదిలేశారు. ఏదో కొద్ది మంది నేతలు పార్టీలో మిగిలి ఉన్నారు అంతే. వారి పని వారు చేసుకుంటున్నారు. అక్కడ పరిస్తితులని సమీక్షించడం, నేతలని దూకుడుగా పనిచేసేలా చేయడం లాంటివి బాబు చేయలేదు. పూర్తిగా ఏపీపై దృష్టి పెట్టారు.

కానీ ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..టీఆర్ఎస్‌ని కాస్త బీఆర్ఎస్‌గా మార్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీ బలపడటానికి సమయం వచ్చిందని కథనాలు వచ్చాయి. ఇంతకాలం తెలంగాణ సెంటిమెంట్‌తో టీడీపీని కేసీఆర్ నామరూపాలు లేకుండా చేశారు. ఆ పార్టీ నేతలనే కాదు..క్యాడర్‌ని అటు తిప్పేసుకున్నారు. ఇక టీడీపీ కోలుకోలేదని చెప్పి..ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఏదో కొంతమంది మాత్రమే టీడీపీలో మిగిలారు. అది కూడా అవుట్‌డేటెడ్ నేతలు. వారి వల్ల పార్టీ బలపడేది లేదు.

ఎలాగో బాబు కూడా పట్టించుకోవడం లేదు. కానీ కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, ఏపీలో కూడా ఎంట్రీ ఇచ్చి రాజకీయం చేయనున్న నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ బలోపేతానికి మంచి దొరికిందని ప్రచారం మొదలైంది. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ టీడీపీలో చేరడం..ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చినట్లైంది.

అసలు బలంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఉండగా కాసాని టీడీపీలో చేరడం విశ్లేషకులని ఆశ్చర్యపరిచారు. ఆయనకు అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి కూడా ఆహ్వానాలు వచ్చాయి. అటు హరీష్ రావు, ఇటు ఈటల రాజేందర్..కాసాని కోసం ట్రై చేశారు. కానీ కాసాని అనూహ్యంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే మునుగోడులో టీడీపీ బరిలో ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి..కానీ తర్వాత పోటీలో ఉండటం లేదని వచ్చాయి.

అయితే బీజేపీకి చెందిన కొందరు…పోటీకి దూరంగా ఉండాలని బాబుని కోరడంతోనే మునుగోడులో పోటీకి దిగలేదని తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితులు సైతం..కొందరు టీడీపీ నేతలని కలిసి మద్ధతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీ-కమ్యూనిస్టుల సపోర్ట్‌తో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి గెలిచారు. ఇప్పుడు కమ్యూనిస్టులు, టీఆర్ఎస్‌కు మద్ధతు ఇస్తున్నాయి. అయితే కనీసం 5-10 వేల వరకు మునుగోడులో టీడీపీ ఓటు బ్యాంక్ ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఒక్క ఓటు కూడా వదులుకోకూడదని క్రమంలో టీడీపీని పోటీ చేయొద్దని కోరి, ఆ పార్టీ మద్ధతు పరోక్షంగా తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ద్వారా బాబుకు, బీజేపీకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి తెలంగాణలో మళ్ళీ బలపడటానికి బాబు సరికొత్త స్కెచ్‌తోనే వెళుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news