బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. తాజాగా బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది. ప్రధానిగా పదవీ చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేయడం గమనార్హం. సొంత పార్టీలో వ్యతిరేకత పెరగడం.. మంత్రుల రాజీనామాతో లిజ్ ట్రస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్‌పై విజయం సాధించిన లిజ్‌ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమె కేవలం 45 రోజుల పాటు ప్రధానిగా పదవిలో ఉండగలిగారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా లిజ్‌ట్రస్ కొనసాగడం గమనార్హం. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల ఆమె ప్రకటించిన మినీ బడ్జెట్‌తో దేశంలో మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత గందరగోళానికి గురైంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, లిజ్‌పై ఒత్తిడికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె డౌనింగ్ స్ట్రీట్ బయట మీడియాతో మాట్లాడారు.
తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపరిచానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకొనేవరకు పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. తీవ్ర ఆర్థిక, అంతర్జాతీయ అస్థితరత కొనసాగుతున్న సమయంలో తాను ప్రధాని పదవి చేపట్టానని చెప్పుకొచ్చారు లిజ్. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తుండటం యూరప్‌తో పాటు బ్రిటన్‌కు ముప్పుగా పరిణమించిందని.. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితిని మరింత క్షీణింపజేసిందని ఆమె పేర్కొన్నారు.