జగన్ రెడ్డి పాలనలో “శాప్” క్రీడాకారుల పట్ల శాపంగా మారింది – నారా లోకేష్

-

వైసిపి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారుల పట్ల శాపంగా మారిందని మండిపడ్డారు. క్రీడాకారులు ఫీజులు చెల్లించలేక క్రీడలకు దూరం అయి తద్వారా రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉందని అన్నారు.

“జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారుల పట్ల శాపంగా మారింది. పేద క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న గ్రౌండ్స్ ని శాప్ ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఈ ప్రక్రియ వలన క్రీడాకారులు ఫీజులు చెల్లించలేక క్రీడలకు దూరం అయ్యి తద్వారా రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉంది. నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న 300 మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకు ఎటువంటి సాయం అందకుండా వేధించారు.

ఇప్పుడు ఏకంగా పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారు. శాప్ లో అర్హత, క్రీడలకు సంబంధం లేని వారిని, వయస్సు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకొని అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పోషించడానికి లేని అభ్యంతరాలు పేద క్రీడాకారుల విషయంలోనే ఎందుకు వస్తున్నాయి” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news