బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హోటల్ షెరటాన్‌లో శుక్రవారం నిర్వహించిన స్మార్ట్ అగ్రి సమ్మిట్- 2022కు మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘సాంకేతికతతో కూడిన సుస్థిర వ్యవసాయం’ అనే అంశంపై మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సాగునీటి వసతి కల్పిస్తూ, సకాలంలో ఎరువులు సరఫరా చేయడమే కాకుండా పెట్టుబడి సాయం, రైతుబీమాతో ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కలిస్తున్నదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులు నమోదవుతున్నాయని, వ్యవసాయ సుస్థిరత సాధించే దిశగా బలమైన అడుగులు వేస్తున్నామని వివరించారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడే నాటికి వ్యవసాయాన్ని ఉపాధిగా చూడలేని దుస్థితి నెలకొందని, రైతుల వలసలు నిత్యం ఉండేవని మంత్రి గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని తెలిపారు నిరంజన్ రెడ్డి. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన సదుపాయాల కల్పనపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి వివరించారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భజలాలు పెరిగాయని, కాళేశ్వరం వంటి అతిపెద్ద ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పనుల పూర్తితో సాగునీటికి రాష్ట్రంలో డోకా లేకుండా పోయిందని ఈ సందర్భంగా వెల్లడించారు నిరంజన్ రెడ్డి. రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా రాష్ట్రంలో 2 కోట్ల 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు నిరంజన్ రెడ్డి.