ఈ మధ్య కాలంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి రాగం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విధానాలని తప్పుబట్టే పరిస్తితి కనిపిస్తోంది. అయితే మొదట నుంచి సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి..తమ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అధికారుల తీరుని తప్పుబడుతున్నారు. తాజాగా కూడా అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులు చేపట్టింది లేదని, రోడ్లపై గుంతలు పూడ్చలేని పరిస్తితి ఉందని, పెన్షన్లు ఇస్తే ప్రజలు ఓట్లు వేసేస్తారా అని చెప్పి ప్రశ్నించారు.
అసలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలని ఓట్లు ఎలా అడుగుతామని నిలదీశారు. అటు తన సీటు విషయంలో కూడా ఆనం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం..అధికారుల తీరుపై ఫైర్ అవుతూ వస్తున్నారు. ఇటీవల పెన్షన్ల కోతపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలోనే దాదాపు 3 వేల పెన్షన్లు తొలగించారు..అలా చేస్తే గడపగడపకు ఎలా వెళ్తామని నిలదీశారు. అయితే ఇలా కోటంరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో జగన్..ఆయన్ని తాడేపల్లికి పిలిపించారు.
తాజాగా జగన్తో కోటంరెడ్డి భేటీ అయ్యి..తన సమస్యలని చెప్పుకున్నారు. ఇక మీటింగ్ తర్వాత కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కొన్ని కుటుంబాలు తన గొంతు కోయడానికి చూస్తున్నారని, అధికారులతో సమస్యలు ఉన్నాయని, అన్నిటిని జగన్కు వివరించానని చెప్పారు. ఇక అనారోగ్యం వల్ల గడపగడపకు ఎక్కువ వెళ్లలేకపోతున్నానని, నిదానంగా అయినా తిరగాలని జగన్ సూచించారని వివరించారు.
అయితే అసంతృప్తి వ్యక్తం చేసిన కోటంరెడ్డిని పిలిచారు గాని..ఆనంకు జగన్ పిలుపు లేదు. మరి ఆయన్ని లైట్ తీసుకున్నారా? అనే చర్చ నడుస్తోంది. ఆనం మరింత ఎక్కువగా విమర్శించడం వల్ల..ఆయనని ఇంకా జగన్ పట్టించుకోవడం లేదని టాక్. మరి చూడాలి ఆనం రాజకీయం ఎలా ఉంటుందో.