కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళనలు మిన్నంటాయి. ఇవాళ భారీ ర్యాలీగా కుటుంబంతో సహా తరలివెళ్లిన బాధిత రైతులు కలెక్టరేట్ ముట్టడించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలువురు రైతులు గాయపడ్డారు కూడా. రైతుల ఆందోళనపై కలెక్టర్ జితేశ్ పాటిల్ స్పందించారు.
రైతులతో మాట్లాడేందుకు సిద్ధమేనని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ పేర్కొన్నారు. రైతుల ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు. రైతులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని అన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
“రైతుల తరఫున 10 మంది వచ్చి వినతిపత్రం ఇవ్వవచ్చు. మాస్టర్ ప్లాన్‌పై రైతుల్లో కొందరు భయం సృష్టించారు. ఇండస్ట్రియల్ మాస్టర్ ప్లాన్ ఇంకా ముసాయిదా దశలోనే ఉంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ ధర్నాను విరమించుకోవాలి. అభ్యంతరాలు ఏమైనా ఉంటే లిఖిత పూర్వకంగా ఇవ్వండి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం.” – కలెక్టర్ జితేశ్ పాటిల్