త్వరలోనే టీఆర్ ఎస్ పార్టీ రెండు ముక్కలు కాబోతోందని, మొన్నటి మంత్రి ఈటల రాజేందర్ మాటలతోనే ఈ విషయం తేలిపోయిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని, కేసీఆర్ లాంటి వారు చాలా మంది వచ్చారు.. పోయారు.. అని కూడా భట్టి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోంది, కేసీఆర్ అవినీతిపై భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
అయితే.. భట్టి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసాయి. భట్టి మాటలు నిజం అవుతాయా..? అన్న కోణంలో చర్చలు మొదలయ్యాయి. నిజానికి.. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఎవరి భిక్ష కాదని, తాను పార్టీలోకి మధ్యలో వచ్చిన వ్యక్తిని కాదని, గులాబీ జెండా ఓనర్లలో ఒకడినని మంత్రి ఈటల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా.. తాను అనామకుడిగా రాజకీయాల్లోకి వచ్చి.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, వారసత్వ అండలేదని కూడా ఆయన చెప్పడం గులాబీ కోటలో కలకలం రేపింది.
నిజానికి.. ఈటల తీవ్ర భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలతో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే.. మంత్రి పదవి పోతుందంటూ జరుగుతున్న ప్రచారం ఖండిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈటల వ్యాఖ్యలపై గులాబీ శ్రేణుల్లోనూ తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా మరో బాంబు పేల్చారు. గులాబీ జెండా ఓనర్ కేసీఆర్ ఒక్కడేనని ఆయన అన్నారు. ఇక ఎర్రబెల్లి వ్యాఖ్యలపై కూడా ఆసక్తికరమైన చర్చమొదలైంది.
అయితే.. టీఆర్ఎస్ రెండు ముక్కలు కాబోతోందంటూ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చర్చమొదలైంది. అయితే.. మైండ్‌గేమ్‌లో భాగంగా భట్టి ఈ వ్యాఖ్యలు చేశారా.. లేక నిజంగానే.. అధికార టీఆర్ఎస్‌లో ఏదైనా ముసలం మొదలైందా..? అన్న కోణంలో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఇక్కడ తెలంగాణలో మరొక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. కొత్త గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే.
వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకే కొత్త గవర్నర్‌ను నియమించారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ నుంచి నేతలను లాగే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!