అవినాష్ రెడ్డి అనుబంధ పిటిషన్లపై నేడు హైకోర్టు నిర్ణయం

-

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి వేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ నిర్ణయం వెల్లడించనుంది. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని నిలువరించాలని, విచారణకు పిలవకుండా అడ్డుకోవాలని అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

వివేకా హత్య కేసులో నిందితుడు షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు అనుమతిస్తూ కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వివేకా వ్యక్తిగత సహాయకుడు ఎంవీ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఈ పిటిషన్​పై సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతి ఇవ్వడంపై నిందితులు ఎర్ర గంగిరెడ్డి(ఏ1), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3) దాఖలు చేసిన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇదే వ్యవహారంపై మరొకరు వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణను సోమవారం రోజున చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news