ప్రధాని మోడీ రేపు హైదరాబాద్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో భాగంగా.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించడంతో పాటు రూ. 11,355కోట్ల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. రెండు గంటల పాటు మోడీ హైదరాబాద్ లో ఉండనున్నారు. ఉదయం 11. 30 గంటలకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. 11. 45 గంటల నుంచి 12.05 గంటల వరకు అక్కడే ఉంటారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత 12. 15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు, Aims కొత్త భవనాల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు మోడీ. 12.50 నుంచి 1.20 గంటల వరకు ప్రసంగించననున్నారు. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకొని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు మోడీ హైదరాబాద్ పర్యటనకు రానున్న వేళ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునివ్వడం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు, నిరసనలు తెలుపుతూ ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు.