కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముస్లిం మైనార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో వారిపై హింస జరుగుతోందంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్.. వాషింగ్టన్లో పీటర్సన్ ఇన్సిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్‌లో జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. భారత్‌లో ముస్లిం మైనార్టీలపై హింస, ప్రతిపక్ష ఎంపీలపై అనర్హత వంటి అంశాలపై పలువురు ఆమెను ప్రశ్నించారు. దీనికి సీతారామాన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘‘ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్. వారి సంఖ్య పెరుగుతోంది కూడా. వారి జీవితాలు కష్టంగా ఉంటే.. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 1947 నాటి కంటే వారి జనాభా ఇంత పెరగగలదా?ఆనాడు ఇస్లామిక్ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వారి సంఖ్య నానాటికీ పడిపోతోంది. కానీ, మా దేశంలో ఆ పరిస్థితి లేదు. మా దగ్గర శాంతి భద్రతలనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశం. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. వాస్తవ పరిస్తితులు ఏమాత్రం తెలుసుకోకుండా ఇలా దేశాన్ని నిందించడం సరికాదు’’’ అని ఆమె మండిపడ్డారు.