ఏఈఈ సివిల్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు గతంలో పేర్కొన్న TSPSC.. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మే 21, 22 తేదీల్లో నాలుగు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ తదితర నియామక బోర్డుల తరహాలో నార్మలైజేషన్ విధానంలో తుది స్కోరును ఖరారు చేయనున్నట్లు TSPSC వెల్లడించింది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి జనవరిలోనే రాతపరీక్షలు నిర్వహించినప్పటికీ లీకేజీ వ్యవహారంతో వాటిని కమిషన్ రద్దు చేసింది. మార్చి 29న పునఃపరీక్షల తేదీలను ప్రకటించింది. అయితే కొన్ని రోజులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్టులను కూడా సీబీఆర్టీలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పోస్టులకు 44,352 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో అంతమందికి ఒకే రోజున సీబీఆర్టీ విధానంలో పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు లేవు. దీంతో అభ్యర్థులకు మే 21, 22న బహుళ షిఫ్టుల విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.