వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై కాంగ్రెస్ అధిష్టానం ఏమి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు..తమ పోటీ చేసే సీట్లని ఫిక్స్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే రేవంత్..కొడంగల్, భట్టి..మధిర, ఉత్తమ్ కుమార్..హుజూర్‌నగర్, జానారెడ్డి..నాగార్జున సాగర్ బరిలో ఉంటామని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తాము పోటీ చేయబోయే స్థానాలపై క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం..నెక్స్ట్ తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. ఇక ఉమ్మడి నల్గొండలో 12 స్థానాలని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈ నెల 28న నల్గొండలో జరిగే నిరుద్యోగ నిరసన దీక్షలో తాను పాల్గొంటానని, కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు లేదని, బిజేపి, బిఆర్‌ఎస్ ల్లో ఉందని అన్నారు.
అదే సమయంలో తాజాగా కాంగ్రెస్ పై బిజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు. మునుగోడు ఉపఎన్నికలో కేసిఆర్..కాంగ్రెస్ నేతలకు 25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలని కాంగ్రెస్ నేతలు ఖండిస్తుంటే..కోమటిరెడ్డి మాత్రం తనకు అవేమీ తెలియవని రేవంత్‌కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలకు బిఆర్‌ఎస్ డబ్బులు ఇచ్చిందన్న విషయం తనకు తెలియదని, ఈటల ఆరోపణలు టీవీలో చూశానని, ఆ ఎన్నికల్లో తాను దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
ఇక ఇలా కోమటిరెడ్డి తెలియదని చెబుతూ..పరోక్షంగా రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఓ వైపు డబ్బులు తీసుకోలేదని రేవంత్ ప్రమాణాలకు రెడీ అవుతుంటే కోమటిరెడ్డి తెలియదని చెప్పి..పరువు అంతా తీసేశారు.