ఏపీ విద్యార్థులకు అలర్ట్. పదవ తరగతి పరీక్షల్లో ఐదు సబ్జెక్టుల్లో పాసైన విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాన్ని నమ్మవద్దని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. కేవలం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మూడు లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో ఒక పేపర్ మినహాయింపు ఉందని, దీనిపై గతంలోనే జీవో జారీ చేశామని చెప్పారు.
వారికి మాత్రమే ఐదు సబ్జెక్టులతో పాస్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. కాగా, పదో తరగతి ఫలితాల్లో 72.26% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి బొత్స ప్రకటించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుము రూ.50 తో ఈనెల 22 వరకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈనెల 13 వరకు అప్లై చేసుకోవాలని మంత్రి సూచించారు. పరీక్షలు పూర్తి అయిన 18 రోజుల్లో ఫలితాలను విజయవంతంగా విడుదల చేశామని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఎలాంటి లీకేజీలు లేకుండా మొత్తం ప్రక్రియ నిర్వహించామని వెల్లడించారు.