ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికమని వివరించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడక్కడా ఎదురైతున్న ధాన్యం కొనుగోళ్లలోని సమస్యలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం తక్షణం స్పందిస్తుందని, విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమస్యలను మరింత వేగంగా పరిష్కరిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, కేంద్ర సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నామని పేర్కొన్నారు.