ఓఆర్ఆర్ ను కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని.. ఓఆర్ఆర్ ను అగ్గువకే ముంబై కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. తాజాగా మరో దోపిడీకి తెర తీశారు వాస్తవానికి ఓఆర్ఆర్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లోనే 10 శాతం అడ్వాన్స్డ్గా చెల్లించాల్సి ఉంటుందని, దాని ప్రకారం ఐఆర్బీ సంస్థ రూ.7,388 కోట్లలో రూ. 738 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.
అయితే ఈ10 శాతాన్ని ఇప్పటి వరకు చెల్లించకుండా ఇంకా సమయం అడగడం విచిత్రంగా ఉన్నదన్నారు. పైగా ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థపై చర్యలు తీసుకోకుండా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. నిబంధనల మేరకు 10 శాతం నిధులు కూడా చెల్లించలేని ఐఆర్బీ సంస్థకు టెండర్ ఎలా ఇస్తారు అని రేవంత్ ప్రశ్నించారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ను ముంబైకి చెందిన ఐఆర్బీ డెవలప్ మెంట్ సంస్థకు కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ఆధ్వర్యంలో తెగనమ్మారని ధ్వజమెత్తారు.