ఒడిశాలో రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు

-

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. రద్దైన రైళ్లలో.. హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సికింద్రాబాద్‌(12703), హావ్‌డా-హైదరాబాద్‌(18045), హావ్‌డా-తిరుపతి(20889), హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా(12840) రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌(18048), సికింద్రాబాద్‌-షాలిమార్‌(22850) వారాంతపు రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. 900 మందికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news