కరోనా లాక్డౌన్ సినిమా ప్రేక్షకులు ఇతర భాషల చిత్రాలను పరిచయం చేయడమే కాదు.. వాటికి బానిసలుగా మార్చేసింది కూడా. చాలా మంది లాక్డౌన్లో ఇతర భాష సినిమాలు చూడటం స్టార్ట్ చేశారు. అలా ఆ భాషపై.. ఆ చిత్రాలపై ప్రేమ పెంచుకున్నారు. అలాంటి వాటిల్లో కొరియన్ సినిమాలు.. సిరీస్‌లు ముందు స్థానంలో ఉన్నాయి. లాక్డౌన్లో సినీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సిరీస్ స్క్విడ్ గేమ్.
2021లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సిరీస్ చూస్తున్నంత సేపు ఉత్కంఠతో ఊగిపోయారు. పేదరికం కారణంగా ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆటలు ఆడేందుకు వచ్చిన 456మందికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? చివరకు ఎంతమంది మిగిలారు? ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సిరీస్ సాగుతుంది.
ఇప్పుడు ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘స్క్విడ్‌గేమ్2’ రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ టుడుమ్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇందులోని నటీనటులను పరిచయం చేశారు. 2024లో ‘స్క్విడ్‌గేమ్2’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.