తెలంగాణలో ఎన్నికల వేడి షురూ అయింది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా కార్యచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రజా సంగ్రామ యాత్ర, జనసంపర్క్ యాత్ర.. ఇక తాజాగా టిఫిన్ బాక్స్ సమావేశాలంటూ ప్రజల్లో కలిసిపోయి.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా టిఫిన్ బాక్స్ సమావేశాలకు బీజేపీ శ్రీకారం చుట్టనుంది. 119అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే సమావేశాలకు రాష్ట్ర పదాధికారులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ప్రతి కార్యకర్త ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్స్ తెచ్చుకొని పార్టీ నాయకులతో ముచ్చటిస్తూ భుజించనున్నారు. ప్రతి నెల టిఫిన్ బైటక్ పేరుతో సహపంక్తి భోజనం చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ బైటక్తో మానవ సంబంధాలు, కార్యకర్తల ఆత్మీయతను పెంపొందిస్తాయని భావిస్తోంది.