జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళుతున్న పవన్..అదే సమయంలో జనసేనని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తారని మొదట నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఆ దిశగా పవన్ వెళుతున్నట్లు లేరు.
పొత్తుని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ముందుకెళుతున్నారు..కానీ పవన్ అలా వెళ్ళడం లేదు..జనసేనకు ఇచ్చే అవకాశాలు ఉన్న సీట్లలో బాబు పర్యటించడం లేదు..ఆ స్థానాల్లో టిడిపికి బలమైన నాయకుల్ని పెట్టడం లేదు. కానీ పవన్ అలా చేయడం లేదు. అన్నీ స్థానాల్లో ఆయన తిరిగేస్తున్నారు. అలాగే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్నారు. అలాగే జనసేనలోకి కీలక నేతలని చేర్చుకుంటున్నారు. ఇటీవలే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరారు. ఈయనకు చీరాల సీటు ఇస్తారని తెలుస్తుంది.
అటు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరుతున్నారు. ఈయన పెందుర్తి సీటు ఆశిస్తున్నారు. ఇక తాజాగా జగన్ సొంత జిల్లా కడపలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి జనసేనలో చేరనున్నారని తెలుస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన ఈయన..గత ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు ఇచ్చారు. తర్వాత వైసీపీకి దూరమయ్యారు. టిడిపిలో చేరాలని చూశారు..కానీ ఈయన ఆశిస్తున్న మైదుకూరు సీటులో టిడిపి నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. దీంతో అటు వెళ్లడానికి ఛాన్స్ రాలేదు.
ఈ క్రమంలో ఆయన పవన్ తో భేటీ అయ్యి..జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. ఈయన మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..పలుమార్లు మంత్రిగా చేశారు. మైదుకూరుతో పాటు కడప రాజకీయాలపై పట్టు ఉంది. డీఎల్ జనసేనలోకి వెళితే..కడపలో ఆ పార్టీకి కాస్త పట్టు దొరికినట్లే.