ఉమా..కష్టం పగవాడికి కూడా రాకూడదు.!

-

ఏపీ రాజకీయాల్లో దేవినేని ఉమా గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపు రెండున్నర దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. మంత్రిగా పనిచేశారు. అసలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మకుటం లేని మహారాజు మాదిరిగా వెలిగిపోయారు. తెలుగుదేశంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఒకానొక సమయంలో చంద్రబాబుకు ఈయన ఎంత చెబితే అంతే అన్నట్లు పరిస్తితి ఉండేది. అలాగే రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పోటీ చేసి విజయం సాదించి..అక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు.

1999, 2004లో నందిగామ నుంచి, 2009, 2014లో మైలవరం నుంచి గెలిచారు. మంత్రిగా చేశారు. కానీ ఒకే ఒక్క ఓటమి ఆయనని పాతాళం వైపుకు తీసుకొచ్చేసింది. 2019లో మైలవరంలో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్…దేవినేనికి చెక్ పెట్టారు. ఆ ఓటమి దెబ్బతో దేవినేని ఇమేజ్ రోజురోజుకూ పడిపోయింది. ఒక్క ఓటమితో సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం మానేశారు. ఆయన మాటలు బాబు వద్ద చెల్లుబాటు అవ్వడం లేదు.

పైగా ఆయన పెత్తనం వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వెళ్ళి..ఇప్పుడు అదే టి‌డి‌పికి మేకులు మాదిరిగా దిగుతున్నారు. ఇక జిల్లాలో ఉమా విలువ పడిపోయింది. ఇప్పుడు ఏకంగా సీటుకే ఎసరు వచ్చింది. ఎలాగో మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో ఆయనకు సీటు ఇవ్వకూడదని మైలవరంలో కొందరు టి‌డి‌పి నేతలు కరపత్రాలు వేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఏమి చేయలేదని, ఇప్పుడు ఇంచార్జ్ గా ఉన్నా..అప్పుడప్పుడు వచ్చి సెంటర్ లో హడావిడి చేసి నాలుగు ఫోటోలు దిగి, మీడియాతో మాట్లాడి వెళ్లిపోవడం తప్ప..నియోజకవర్గంలో సమస్యలపై పోరాడేది ఏమి లేదని, ఆయనకే మళ్ళీ సీటు ఇస్తే ఓడిపోతామని కాబట్టి ఆయనని మార్చాలని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటికే టి‌డి‌పి ఎంపీ కేశినేని నాని..అక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంతకు మద్ధతు ఇస్తున్నారు. ఇటు టి‌డి‌పిలోనే బొమ్మసాని సుబ్బారావు..ఉమాకు చెక్ పెట్టి సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. బొమ్మసానికి కేశినేని సపోర్ట్ ఉంది. ఇలా అన్నీ రకాలుగా ఉమా కార్నర్ అయిపోయారు. అటు బాబు మద్ధతు లేదు. అందుకే ఉమా కష్టం పగవాడికి కూడా రాకూడదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news