అసలైన ‘హుజూర్‌’ జగదీశ్‌రెడ్డి..!

-

అధికారపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్‌నగర్‌ ఎన్నికపై వారికి తొలుత కొంత సందిగ్థత ఉండేది. అధిష్టానం నేరుగా ఆదేశించకపోయినా జగదీశ్‌రెడ్డి సవాల్‌గా స్వీకరించి, ఉత్తమ్‌కుమార్‌ను మ్యూట్‌ చేసారు.

హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌కు పెట్టని కోట. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కంచుకోట. ఆయన్ను దాటి ఆ నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు జరగవు

 

.  2009, 2014, 2018లలో గెలిచి ఉత్తమ్‌ హ్యట్రిక్‌ తీసుకున్నాడు.  కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీగా నిలబడాల్సివచ్చినపుడు, హుజూర్‌నగర్‌కు రాజీనామా చేసి బరిలో దిగాడు. అప్పుడు కూడా ఆయన్ను హుజూర్‌నగరే అదుకున్నది. ఆ సెగ్‌మెంట్‌ నుండే ఉత్తమ్‌కు 13వేల ఆధిక్యం వచ్చింది. అటువంటి హుజూర్‌నగర్‌ ఇప్పుడు టీఆరెస్‌కు ‘జీ హుజూర్‌’ అంది. అదంతా మంత్రి జగదీశ్‌రెడ్డి మహిమ.

2009లో ఇదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన జగదీశ్‌రెడ్డి, ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు ఎవరికీ తెలియదు. ఆఖరికి టిఆర్‌ఎస్‌ అధిష్టానానికి కూడా. అందుకు తగ్గట్టే, అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ఉపఎన్నిక ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయినా అందరినీ సమన్వయం చేసుకుంటూ జగదీశ్‌ ముందుకుసాగారు. వాస్తవానికి ముందునుంచే హుజూర్‌నగర్‌ విజయంపై నాయకులకు, అధినేతకు క్యాడర్‌కు, ఆఖరికి తెలంగాణ ప్రజలకు కూడా సందేహమే ఉంది. పులి మీద పుట్రలా ఆర్టీసీ సమ్మె ఒకటి. దీంతో టీఆర్‌ఎస్‌ పనయిపోయిందనుకున్నారంతా. కాంగ్రెస్‌ కూడా సంబరపడింది ఇక్కడే.

నిజానికి ఉత్తమ్‌ రాజీనామా చేసినప్పటినుండే జగదీశ్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటికి ఎటువంటి ఎలక్షన్‌ సందడి, చర్చలు లేకపోయినా, తన మానాన తాను గెలుపు పునాదులు వేసకుంటూపోయారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ మినరల్ నిధలును ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధిపనులకు ఖర్చుచేసి, ప్రజల దృష్టిలో పడ్డారు. మండలాలవారీగా గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని, ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నారు. అందుకుతగ్గ వ్యూహాన్ని సిద్ధం చేసుకుని శ్రేణులను ముందుండి నడిపించారు. పల్లెపల్లెకూ వెళ్లి ప్రతీవారినీ పలకరించారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దయినా, ఆ లోటు తెలియకుండా తనే కలియతిరిగారు. ఇంచార్జి పల్లా సైతం మంత్రిగారి ఆలోచనలను తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి గెలుపును ఖాయం చేసుకున్నారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రధానంగా మూడు మండలాలపై తన దృష్టినంతా కేంద్రీకరించారు. అవి, నేరేడుచర్ల, మేళ్లచెరువు, గరిడెపల్లి. ఈ మూడు మొదటినుంచీ ఉత్తమ్‌కు కరుడుగట్టిన కంచుకోటలు. వీటిని బద్దలు కొడితేనే విజయం సిద్ధిస్తుందని అంచనా వేసిన జగదీశ్‌, ఖచ్చితమైన ప్రణాళిక అమలుచేసి విజయవంతంగా ఆ మూడింటినీ తనవైపు తిప్పుగోగలిగారు. అక్కడే హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గింది. మిగిలిందంతా నల్లేరుమీద బండినడకే.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నారు పెద్దలు. దాన్ని ఆచరణలో పెట్టిన జగదీశ్‌రెడ్డి అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఎక్కడా కాంగ్రెస్‌కు చిన్న అనుమానం కూడా కలక్కుండా వారి ఓటు బ్యాంకును చేధించారు. ముఖ్యంగా జిల్లా టిఆర్‌ఎస్‌ నేతలందరినీ ఒక్కతాటిపై నిలిపి, తాననుకున్న వ్యూహాలను పక్కాగా అమలుచేసారు. ముందునుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత అప్తుడిగా పేరున్న జగదీశ్‌రెడ్డి, ఆయన ఒకింత సందేహపడిన హుజూర్‌నగర్‌ను గెలిచి అధినేతకే బహుమతిగా అందజేసారు. ఈ విజయంతో పట్టలేని ఆనందాన్ని పొందిన కేసీఆర్‌ జగదీశ్‌ను పొగడ్తలతో ముంచెత్తినట్లు సమాచారం.

మనమెప్పుడూ సడి చేయకూడదు. మనం సాధించిన విజయమే హోరెత్తించాలి. ఇదే విజయసూత్రం. జగదీశ్‌రెడ్డి ఇదే సూత్రానికి కట్టుబడిఉన్నారు. ఆయనిప్పుడొక నిజమైన, విలువైన నాయకుడు.

రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news