చల్లగా ఉన్నప్పుడే స్పైసీ ఫుడ్‌ తినాలని ఎందుకు అనిపిస్తుంది..?

-

వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వెదర్‌ మస్త్‌ కూల్‌ ఉంది. ఈ ముసురు వర్షాలకు వేడి వేడిగా బజ్జీలు, కారం కారంగా ఉండే పకోడీలు లాంటివి తినాలని మనసు లాగేస్తుంది కదా..! అసలు వర్షాకాలంలోనే స్పైసీ ఫుడ్‌ ఎందుకు తినాలనిపిస్తుంది. బయట చల్లగా ఉంది కాబట్టి మనకు కారంగా ఉండేవి కావాలనిపిస్తుంది. కానీ దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయి. శరీరంలో ఏం మార్పులు జరగడం వల్ల ఇలాంటి కోరికలు వస్తాయో తెలుసా..?

కారం, మసాలా ఘాటు బాగా ఉండే ఆహారాన్ని స్పైసీ ఫుడ్ అంటారు. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల, స్పైసీ ఫుడ్‌లో ఉండే కొన్ని ఆహార రసాయనాల వల్ల ఇలా స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుందట. వర్షాలు పడినప్పుడు, శీతాకాలంలో వాతావరణ చల్లగా మారిపోతుంది. అప్పుడు మసాలా ఆహారాన్ని తినాలన్న కోరిక శరీరంలో పుడుతుంది. స్పైసీ ఫుడ్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది శరీరంలో వెచ్చదనాన్ని కలిగించి వేడి పుట్టిస్తుంది. అందుకే మన శరీరంలో చల్లని వాతావరణంలో స్పైసీ ఫుడ్‌ను కోరుకుంటుంది.

వర్షాకాలంలో మన శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరొటోనిన్ స్థాయులు తగ్గిపోతాయి. దానికి కారణం సూర్యరశ్మి లేకపోవడం. దీంతో శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిలో మార్పులు వస్తాయట. దీంతో వీటిని ఎడ్జెస్ట్ చేయటానికి మన శరీరం కార్బోహైడ్రేట్లు కావాలని కోరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు శరీరంలో సెరొటోనిన్ స్థాయుల్ని పెంచుతాయి. దీంతోపాటే డీప్ ఫ్రై చేసిన స్నాక్స్‌లో తేమ లేకుండా పొడిగా ఉంటాయి. నోట్లోవేసుకోగానే కరకరలాడతాయి. మన చుట్టూ ఉన్న చల్లని వాతావరణానికి ఈ ఆహారం తింటే మనకు నచ్చుతుంది.

వర్షాకాలంలో క్రిస్పీగా, ఫ్రై చేసిన స్నాక్స్‌ తినాలనిపిస్తుంది. కాస్త కారం కారంగా ఉండేవి తినాలనిపిస్తుంది. వర్షాకాలంలో స్పైసీ స్నాక్స్ అంటే ముందు గుర్తుకొచ్చేది మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ బండి కనిపిస్తే ఠక్కున ఆగిపోయి ఓ ప్లేట్ తీసుకుని వెంటనే వేడి వేడిగా లాగించేయాలనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో చల్లదనం పెరిగి వేడి కావాలనిపిస్తుంది. దాని కోసం మిర్చి బజ్జీపై మనస్సు లాగేస్తుంది. మిరపకాయల్లో క్యాప్సైసిన్ ఉంటుంది. మనం కారం తినగానే నోట్లోని నరాల గ్రాహకాలకు ఇది మనం ఏదో వేడి పదార్థం తిన్నామనే భావన కలగజేస్తుంది. దాంతో మెదడు మనకు చెమట పట్టేలా చేస్తుంది. మనలో ఆనందాన్ని పెంచే డోపమైన్‌ను మన రక్తంలోకి విడుదల చేస్తుంది.

నిరుత్సాహాంగా ఉన్నా తినాలనిపిస్తుంది..

స్పైసీ ఫుడ్ తినాలనిపించటానికి వేరే కారణాలు కూడా ఉంటాయట. మనకు నిరుత్సాహంగా ఉన్నా అటువంటి ఆహారం తినాలనిపిస్తుందట. స్పైసీ ఫుడ్ యాంటీ డిప్రెసెంట్‌గా పనిచేస్తుందట. డిప్రెస్‌గా ఉన్నప్పుడు శరీరం ఇలాంటి ఆహారాన్ని కోరుకుంటుంది. మీకు నిరాశగా అనిపించినప్పుడు స్పైసీ ఫుడ్ తింటే ఉపశమనం కలుగుతుంది. కానీ నిరాశ, నిస్పృహలు కలిగితే కేవలం స్పైసీ ఫుడ్ తిని ఊరుకోవద్దు..ఎందుకైనా మంచిది వైద్యులను సంప్రదించటం మంచింది.

వర్షంలో తడిస్తే ముక్కు కారుతూ, తుమ్ములు వస్తుంటాయి. జలుబు చేస్తుంది. ఇలాంటి సమయంలో కూడా కారంగా ఉండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఆహారం రినైటిస్ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది.

శరీరంలో ఇంత జరుగుతుంది కాబట్టే మనకు వాటిమీద మనసు వెళ్తుంది.. అంటే మనకు మనంగా వాటిని తినమా.. లోపల నుంచి సిగ్నల్స్‌ వచ్చి తిను తిను అని ఫోర్స్‌ చేస్తాయా..? భలే ఉంది కదా..! ఏది ఏమైనా ఇలా తినాలనిపించినప్పుడు ఇంట్లో చేసుకుని తినండి. అన్ని విధాల మంచిది. బయట అంటే అప్పటిమంద ఓకే కానీ దానివల్ల మళ్లీ లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.!

Read more RELATED
Recommended to you

Latest news