రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని వర్షాలు-వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులను.. ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం భారీ వరదలతో మునిగిపోయింది. మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ పంపాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. పూర్తిగా నీటమునిగిన మోరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. హెలికాప్టర్ కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులతో సీఎస్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయి. ముంపు ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.