తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న బిల్లు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును తాజాగా జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించినా.. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సర్కార్ నిర్ణయానికి బ్రేక్ పడినట్లైంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో టాక్.
అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దీన్ని ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటల.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోందని.. కావాలని బట్టకాల్చి గవర్నర్ మీద వేస్తున్నారని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులను బలవంతంగా రాజ్‌భవన్ పంపుతున్నారని ఎమ్మెల్యే ఈటల మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2 పీఆర్సీలు బకాయి ఉన్నారని గుర్తు చేసిన ఈటల.. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా ఫైర్ అయ్యారు.