కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం కోసమే అందరి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. దీనిపై బహుశా ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఉభయసభలు సమావేశం అవ్వడానికి ముందే అధికారికంగా “నోటిఫికేషన్” విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఒకవేళ ఏ మాత్రం జాప్యం జరిగినా, వెనువెంటనే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయుంచేందుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ కి సెషన్స్ కోర్టు రెండేళ్ళ శిక్ష విధించిన వెంటనే లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేసినంత వేగంగా, సుప్రీంకోర్టు “స్టే” ఉత్తర్వులు తర్వాత అంతే వేగంగా స్పీకర్ ఓం బిర్లా స్పందించకపోతే, ఇప్పటికే పలు అంశాలపై ఆందోళన పథంలో ఉన్న ప్రతిపక్షాల కూటమి కి ఈ అంశం కూడా మరో అస్త్రం కానుంది. లక్షదీప్ కు చెందిన “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ” (ఎన్.సి.పి)ఎమ్.పి మహమ్మద్ ఫైజల్ విషయంలో కూడా సభ్యత్వ పునరుద్దరణ నెలపైగానే జాప్యం అయింది. కానీ రాహుల్ విషయంలో త్వరగానే నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.