ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో తాను 1,200 ఎకరాల్లో చారిటీ సిటీ నిర్మించానని, దాన్ని చూసి దేశవిదేశాల ప్రతినిధులు ఆశ్చర్యపోయారని కేఏ పాల్ తెలిపారు.
అయితే, అప్పట్లో తాను వైఎస్సార్ కు డబ్బులు ఇవ్వలేదంటూ ఆ చారిటీ సిటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూయించారని కేఏ పాల్ ఆరోపించారు. చారిటీ సిటీ విషయంలో జగ్గారెడ్డి చాలా గొడవ చేయించారని కేఏ పాల్ వెల్లడించారు. అయినప్పటికీ తాను జగ్గారెడ్డిని ఏనాడూ శపించలేదని తెలిపారు. జగ్గారెడ్డిని ఇప్పటివరకు క్షమించానని, ఇక క్షమించబోనని కేఏ పాల్ అన్నారు.
ఆయనను తమ ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. రూ.1000 కోట్లు ఇచ్చే బీఆర్ఎస్ లో చేరతారో, అభివృద్ధి చేసే ప్రజాశాంతి పార్టీలో చేరతారో జగ్గారెడ్డి తేల్చుకోవాలని స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని కేఏ పాల్ అన్నారు.