అభిమానులకు పవర్ స్టార్… కార్యకర్తలకు జనసేనాని… ఆయనే పవన్ కళ్యాణ్. ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నాడు. పవన్ అంటే పడి చచ్చే వీరాభిమానులు, కార్యకర్తలున్నారు. జనాల్లో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాలను, రాజకీయాలను వేరుగా చూస్తారనే విషయం గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసినప్పుడు ప్రత్యక్షంగా అర్దమైపోయింది. అందుకే ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నాడాయన. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహరచన చేసుకుంటున్నారు. అదేవిధంగా తనకు సీఎంగా ఒక్కఛాన్స్ ఇవ్వమని కూడా తన వారాహీ యాత్రలో ప్రజలను వేడుకుంటున్నారు.
పవన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరు హీరోలకు అభిమానులుంటారు. కానీ పవన్ కి మాత్రం భక్తులు ఉంటారనే విషయం చాలా సందర్భాల్లో రూఢీ అయింది. పవనిజం పేరుతో ఫ్యాన్స్ చేసే హడావుడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పవన్ సినిమాలు చేయాలని, అలాటే రాజకీయాల్లోనూ రాణించాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వారాహీ యాత్రకు బ్రేక్ ఇచ్చి, సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్. రీసెంట్‌గా బ్రో మూవీతో భారీ హిట్టు కొట్టిన పవన్ చేతిలో ఇంకా మూడు సినిమాలున్నాయి. హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఎన్నికల నాటికి సినిమాలను కంప్లీట్ చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లో రావాలని పవన్ యోచన.
సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా జనసేన సేవా కార్యక్రమాలను చేపట్టనుంది. ఇక అభిమాన సంఘాల గురించి ప్రత్యకంగా చెప్పేదేముంది. రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తలపెట్టింది. వారం, పది రోజుల పాటు జరగనున్నాయి. ఈ పది రోజుల వరకు ఆయన సినిమా షూటింగ్‌లోనే పాల్గొనే అవకాశముంది. ఇక, మూడో వారం నుంచి పవన్ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాలుగో దశ వారాహి యాత్ర మొదలుపెట్టనున్నారని సమాచారం. దానికి తగినట్లే జనసేన పార్టీ రూట్ మ్యాప్ డిజైన్ చేస్తోందట. ఇకపై ప్రతి నెలలో సగం రోజులు సినిమాలకి, సగం రోజులు రాజకీయాలకి సమయం కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారట. సినిమాలు పూర్తయితే ఫుల్ టైమ్ పాలిటిక్స్ లో బిజీ కావాలని పవన్ వ్యూహంగా తెలుస్తోంది. అంటే వచ్చే ఏడాది జనవరి నుండి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారట. జనవరి నుంచి విరామం లేకుండా వారాహి యాత్ర చేపట్టి, మిగిలిన అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలని ప్రణాళిక చేస్తున్నారన్నమాట. రెండు నావలపై పవన్ పయనం ఎలా సాగుతుందో వెయిట్ అండ్ వాచ్.