తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన పూర్తవ్వగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. వాటిని పరిశీలించి ఫైనల్ చేసే ప్రక్రియను షురూ చేస్తోంది. బలమైన అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ నెలలో కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఒకవైపు పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. పార్టీల నేతలు హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ములుగు నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే సీతక్క. ములుగు నియోజకవర్గంలో త్వరలో రానున్న ఎన్నికల్లో ప్రజాసేవకు, డబ్బు సంచులకు మధ్య పోటీ జరుగుతుందని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. తనను ఓడించేందుకు బీఆర్ఎస్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి సిద్దంగా ఉందని ఆరోపించారు. తాను ప్రజాసేవ చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, అందుకే డబ్బులతో తనను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సీతక్క విమర్శించారు. ప్రభుత్వం తనపై కక్ష సాధించాలని చూస్తుందని, డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, అది ఎప్పటికి జరగదన్నారు ఎమ్మెల్యే సీతక్క.