తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సంగారెడ్డిలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్లో అవకతవకల వల్ల తలెత్తే లోపాలను సవరిస్తామని అన్నారు.‘తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈ సారి ఎన్నికల్లో పోటీ జరగనుంది. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం ఉంటేనే సుభిక్షంగా ఉంటుంది.
కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. నాడు ఓటుకు నోటు,- నేడు నోటుకు సీటు. ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థను మళ్లీ తెచ్చినట్టే. ధరణిని వ్యతిరేకించేటోళ్లను ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతరు. అందులో ఏమైనా లోపాలుంటే సరిచేస్తం. దేశంలో కరెంటు కోతలు ఉంటే మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. కర్నాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని అక్కడి ప్రభుత్వాన్ని తిడ్తున్నరు.తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని కిషన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తరు. తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్. రాష్ట్రంలో కేసీఆర్ ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలే’ అని హరీశ్ అన్నారు.