ఓ పువ్వులా ఆడపిల్ల ఇంటికి అందాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది. ఓ ఆప్యాయపు పిలుపులా, అనురాగపు మెరుపులా అందరినీ అలరిస్తుంది. చెల్లిలా, తల్లిలా, సహచరిలా, స్నేహశీలిగా జీవితం నిండా ప్రకాశిస్తుంది. చదువులో, ఉద్యోగంలో, ఇంటా బయటా ప్రతిచోటా ఒక ధీరలా, ప్రజ్ఞావనిలా రాణిస్తుంది. అవనిలో సగంగా, ఆకాశంలో సగంగా ప్రతిభావంతంగా వెలిగే ఆడపిల్లకు.. ఇంకా ఇంకా ఆటంకాలూ అవరోధాలూ అనేక రూపాల్లో తారసపడుతూనే ఉన్నాయి.
ఒకపక్క ఆదిశక్తి అని స్తోత్రాలు వల్లిస్తూనే – మరోపక్క దారుణంగా హింసిస్తున్న వివక్ష కళ్లకు కడుతూనే ఉంది. ఈ వ్యత్యాసం పోయినప్పుడే ఈ భువికి నిజమైన వెలుగు. ఈ నాగరికతకు సరైన అర్థం. బాలికల హక్కుల ఉల్లంఘన, మానవహక్కులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది అక్టోబర్ 11 వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి మొదట డిసెంబర్ 19న 2011లో ప్రకటించింది.
మహిళలపై వాయిలెన్స్ వ్యతిరేకంగా ఓ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం వివిధ రకాలగా హాని కలిగిస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్దికి, మహిళా సాధికారతకి అది అవరోధం కలిగిస్తుంది. అందుకే బాల్యవివాహాలని నిరోధించి,హింస నుండి ఆమెను రక్షించడానికి సమాజంలో అందరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కిశోర బాలికలని స్వశక్తివంతు లుగా తీర్చి దిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం.
బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమిస్తున్న పాకిస్తానీ బాలిక చొరవ , సాహసం, చైతన్యం ఆమెను నోబెల్ బహుమతి దక్కేలా చేశాయి. విద్యావంతుల కుటుంబంలో, సామాజిక చైతన్యం గల నేపథ్యం నుండి వచ్చిన మలాలా లే కాదు. కొద్ది పాటు చైతన్యం ఇస్తే సామాజికంగా వెనుకబడ్డ, నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి కూడా ఏంటో మంది మలాలాలు ఉద్భవిస్తారు. తమపై జరిగే హింసని , దాడులని తిప్పికోడతారు. అన్ని అభివృద్ధి చెందుతున్నదేశాల్లో దాదాపు సగం శాతం ఆడపిల్లలు 18 సంవత్సరాలోపే తల్లులుగా మారడంతో ఆరోగ్యసమస్యల్ని ఎదుర్కొంటున్నారు.
16వ శతాబ్దం వరకు గాళ్ అనే పదంతో ఆడ, మగ ఇద్దరినీ సంబోధించేవారు. ఈ ఏడాది తీసుకున్న ప్రధాన నినాదం : మంచి భవిష్యత్తు కోసం బాలికల సాధికారిత. ఈ థీమ్‌తో ఈ ఏడాది జనవరి నుంచి బాలికల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రత్యేక దినోత్సవాల్లో ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఏదో ఒక కాంపెయిన్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంటే తప్ప ఆడపిల్లపట్ల తరతరాలుగా నిండి ఉన్న భావనలు సమూలంగా పోవు.