ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తాశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని చెప్పారు. ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయని తెలిపారు. ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలన్నారు. కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారు. అందుకే బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్ ఎంపీలే. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.