మళ్ళీ పుట్టు శ్రీ… ఇట్లు ఇండియన్ సినిమా…!

-

భారతీయ సినీ, వినీలాకాశంలో చెరగని ముద్ర వేసుకున్న నటి అతిలోక సుందరి శ్రీదేవి. ఏ స్టార్ హీరోకి దక్కని గుర్తింపు, ఏ స్టార్ హీరోకి రాని క్రేజ్ ఆమెకు సొంతం. రాజుల కాలం అయి ఉంటే ఆమె కోసం ఎన్నో దండయాత్రలు జరిగి ఉండేవని ఎందరో ఆమె సినిమాలు చూసి కామెంట్స్ చేసేవారు. తెర మీద శ్రీదేవి ఉంటే చాలు సినిమా హిట్ ఫ్లాప్ కి సంబంధం ఉండదు. ఏ పాత్రలో అయినా ఏ సన్నివేశంలో అయినా ఆమెను అభిమానులు ఆదరించారు.

శ్రీదేవికి భక్తులు అయ్యారు… సినీ జీవితం మొదలైన నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకు కూడా ఆమెను కోట్లాది మంది అభిమానులు ఆరాధించారు. శ్రీదేవి ఇక లేరు అనే నిజాన్ని ఏ అభిమాని కూడా జీర్ణించుకోలేదు. హీరోయిన్ అంటే గ్లామర్… అంత వరకే. కాని హీరోయిన్ అంటే నటన, హీరోయిన్ అంటే డాన్స్, హీరోయిన్ అంటే సినిమా అని నిరూపించిన నటి శ్రీదేవి. శ్రేదేవి లాంటి నటిని భారతీయ సినిమా మళ్ళీ చూడలేదు.

తమిళనాడు లోని శివకాశిలో ఆగస్టు 13, 1963 జన్మించిన శ్రీదేవి బాల నటిగా, అగ్ర హీరోయిన్ గా వందల సినిమాలు చేసింది. ఏ హీరోయిన్ కూడా సంపాదించని క్రేజ్ సంపాదించింది. తనకంటూ ఒక చరిత్రను ఆమె లిఖి౦చుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు పడింది శ్రీదేవి. తన తల్లి కోసం సినిమాలు చేసారు శ్రీదేవి. సినిమాలో ఆమె సంపాదించుకున్న పేరు వ్యక్తిగత జీవితంలో సంతోషానికి ఎన్నడూ కారణం కాలేదు.

బోనీ కపూర్ ని వివాహం చేసుకోవడం తో నా అన్న వాళ్ళు దూరమయ్యారు. సన్నిహితులు చివరి శ్వాస వరకు మాట్లాడలేదు. బోని కపూర్ కుటుంబం ఆమెను కనీసం మనిషిగా కూడా చూడలేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హింది ఇలా ఏ భాష చూసినా సరే శ్రీదేవే అగ్ర హీరోయిన్. ఆమెతో సినిమా చెయ్యడం అనేది దర్శకులకు ఒక కల… చిరకాల వాంఛ. శ్రీదేవి కోసం ఎన్నో కథలు ప్రత్యేకంగా రాసుకున్న దర్శకులు ఉండే వారు.

ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయిన గేయ రచయితలు ఆమె కోసమే ప్రత్యేకంగా పాటలు రాసుకున్నారు. హీరోలు ఆమె పక్కన అందంగా కనపడాలని వ్యాయామాలు చేసే వారు. శ్రీదేవి సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు వ్యక్తిగత పనులు మానుకుని సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులు శ్రీదేవి కోసం గుండెల్లో గుడి కట్టుకున్నారు.

ఆమె చేసిన సినిమాలు, ఆమె పని చేసిన దర్శకులు, ఆమెతో కలిసి నటించిన హీరోలు ఏ హీరోయిన్ కూడా చేయలేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా చేసే అవకాశం లేదు. ప్రతీ సినిమా అభిమానికి శ్రీదేవి అంటే ఒక పిచ్చి. నేడు ఆమె లోకాన్ని విడిచి ఉండవచ్చు. కాని ఆమె వేసిన ముద్ర మాత్రం భారతీయ సినిమా మీద తప్పకుండా ఉంటుంది. తమిళనాడులో పుట్టి భారతీయ సినిమాలో తొలి లేడీ సూపర్ స్టార్ అయ్యారు.

ఆమె జీవితం కష్టాల మయం, ఆమె సినిమా అజరామరం, ఆమె మించిన నటి లేదు, ఆమె స్థాయిని అందుకునే రేంజ్ కూడా ఎవరికి లేదు. శ్రీదేవి సినిమాను కావాలనుకుంది. కాని శ్రీదేవిని సినిమా తనలో దాచుకుంది. ఆమె మరణం ఒక సందేహం… తీరని సందేహం. నా అన్న వాళ్ళ అవమానాలు వేదించినా, వెండి తెర మీద పడిన పూలలో ఆమె తన సంతోషాన్ని వెతుక్కుంది. ఎన్నో అవార్డులు, ఉత్తమ నటిగా ఆమెను వరించాయి.

శ్రీదేవి అనే పేరు భారతీయ సినిమాలో ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎప్పటికి ఉంటుంది. దర్శకులు ఆమె డేట్స్ కోసం ఎదురు చూడటం కాదు అవసరం అయితే పడిగాపులు పడే వారు. శ్రీదేవి తో సినిమా కోసం హీరోలు వ్యక్తిగత జీవితాలను కూడా వదిలేసుకున్నారు. శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్ళు అవుతుంది. ఆమె అందానికి, ఆమె నటనకు ఆమె అభినయానికి ఎప్పటికి చావు లేదు. ఎందుకంటే శ్రీదేవి అంటే సినిమా… సినిమా అంటే శ్రీదేవి.

Read more RELATED
Recommended to you

Latest news