బిగ్ బ్రేకింగ్; తెలంగాణాలో ఇవాళ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు – కేసీఆర్‌

-

తెలంగాణాలో ఇవాళ ఒక్క రోజే పది కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో 59 కరోనా కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. లాక్ డౌన్ ప్రకటించకపోయి ఉంటే నేడు కరోనా కేసులు మరింతగా పెరిగి ఉండేవని కెసిఆర్ అన్నారు.

వ్యాధిని నిరోధించడమే కరోనా నివారణకు మందు అని ఆయన అన్నారు. 25 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాకు మందు కనుక్కోలేదని అన్నారు. అమెరికా ,చైనా ,ఇటలీ స్థాయిలో కరోనా వ్యాపిస్తే 20 కోట్ల మంది కరోనా బారిన పడతారని కెసిఆర్ హెచ్చరించారు. ఆ మాటలు నిపుణులు చెప్తున్నారని అన్నారు.

లాక్ డౌన్ చేయకపోతే అందరి జీవితాలు ప్రమాదంలో పడేవని అన్నారు. సామాజిక దూరం పాటించడం మినహా మనకు గత్యంతరం లేదని ఆయన అన్నారు. స్వీయ నియంత్రనే మనకు శ్రీరామ రక్ష అని చెప్పుకొచ్చారు. ఏమవుతుంది లే అనే నిర్లక్ష్యం వద్దని కెసిఆర్ హెచ్చరించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ తో మాట్లాడా అని ఆయన అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారని, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.

ఇళ్ళల్లో నుంచి ఎవరు బయటకు రావొద్దని, గుంపులు గుంపులు గా అసలు రావొద్దని ఆయన హెచ్చరించారు. అమెరికా లాంటి దేశానికే వెంటిలేటర్ కొరత ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎక్కడా ధైర్యం కోల్పోలేదని, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా కేసులు పెరుగుతున్నాయని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేసారు.

పూర్తి స్థాయిలో వ్యాధి వ్యాపించినా సరే ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు లైట్ తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 80.9 శాతం కరోనా బాధితులకు ఇళ్ళల్లో ఉంచి చికిత్స చేస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి 500 వెంటిలేటర్లు తెప్పిస్తున్నామని చెప్పారు.

చికెన్ తింటే కరోనా వస్తుందని చాలా మంది ప్రచారం చేస్తున్నారని, చికెన్ కోడి గుడ్డు తింటే కరోనా వైరస్ తగ్గుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, మన బలంగా ఉంటే వైరస్ ప్రభావం చూపించే అవకాశం ఉండదని కెసిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఎవరూ కూడా చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని భయపడవద్దని ఆయన అన్నారు. అలాగే బలమైన ఆహారం తీసుకుంటే మంచిది అని కెసిఆర్ సూచించారు.

రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల ప్రజల కడుపు నింపుతామని ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాళ్ళు ఎవరూ భయపడవద్దని హాస్టల్స్ మూసి వేయడం లేదని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆందోళనలో ఉందని కాబట్టి అందరూ సహకరించాలని కెసిఆర్ సూచించారు. రైతులు ఎవరూ కూడా కంగారు పడవద్దని అన్నారు.

పోలీసులకు, అధికారులకు ప్రజలు అందరూ సహకరించాలని కెసిఆర్ ఈ సందర్భాగా సూచించారు. హైదరాబాద్ లో ఇతర రాష్ట్రాల కూలీలు ఎక్కువగా ఉన్నారని వారు అందరికి కూడా తాము ఆహారం అందిస్తామని అన్నారు. ఏప్రిల్ 10 వరకు కూడా నీటి సరఫరా ఆపే పరిస్థితి లేదని అన్నారు. 24 గంటల కరెంట్ అందిస్తామని అన్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులు తీసుకొచ్చే వాహనాలకు అనుమతి ఇస్తామని అన్నారు.

తెలంగాణాలో పండే పంటలు ఇతర రాష్ట్రాలకు పంపే అవకాశం లేదని అన్నారు. ఇక్కడి ప్రజలకు అవసరం కాబట్టి పంటలు అన్నీ ఇక్కడే ఉంటాయని అన్నారు. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కెసిఆర్ పేర్కొన్నారు. పంటలు అన్నీ కూడా ప్రభుత్వమే మీ ఊరులోనే కొంటుందని అన్నారు. తన జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు అని కెసిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news