1982న ప్రాంతీయ పార్టీగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఆదివారం(మార్చి 29)తో 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలు గుదేశం రాజకీయ ప్రస్థానంలో అనేక మెరుపులు, అక్కడక్కడ కొన్ని మరకలు కనిపిస్తాయి. 38 సంవత్సరాల చరిత్రలో మొత్తం 22 సంవత్సరాలు అధికారంలో ఉండటం ఓ ప్రధాన విశేషమే. అయితే, ‘తెలుగుదేశం’ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాల్లో చోటుచేసుకొన్న గుణాత్మక మార్పులు, అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి దోహదపడిన పరిస్థితులను అతిపెద్ద విశేషాలుగా చెప్పాలి. తెలుగుదేశం ప్రస్థానాన్ని రెండు భాగాలుగా, ఒకటి – ఎన్టీ రామారావు సారధ్యంలో జరిగింది.
రెండోది చంద్రబాబునాయుడు నేతృ త్వంలో 1995 సెప్టెంబర్ మొదలుకొని నేటివరకు సాగిస్తున్న ప్రయాణాన్ని విడివిడిగా చూడాలి. 1995 సెప్టెంబర్‌లో పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబునాయుడు ‘తెలుగుదేశం పార్టీ’ కి ఓ కొత్త రూపు ఇవ్వడానికి కృషి చేయడం మొదట్నుంచీ స్పష్టంగా కనపడుతుంది. తొలినాళ్లల్లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టారన్న అపప్రథ తెచ్చుకొన్నప్పటికీ.. చంద్రబాబు సారథ్యంలో.. సామాజిక న్యాయం చేయగలిగారు. పార్టీలో నాయకుల్ని ప్రోత్సహించడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం, సీనియర్ లీడర్లు చెప్పే సలహాలు, సూచనల్ని పరిగణనలోకి తీసుకోవడం వంటివి బాబు పాటించారు.
అయితే, ఇప్పుడున్న టీడీపీ పరిస్థితి పరిస్థితిని మరోకోణంలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు తర్వా త పార్టీ పరిస్థితి మారిపోయింది. అతివిశ్వాసం పార్టీ అధినేతను ఆవరించగా.. పార్టీ నుంచి సీనియర్లు సైతం జంప్ చేసేయడం, పార్టీ గెలుస్తుందనే ధీమాతో ఎవరినీ లెక్కచేయని తనం వంటివి చంద్రబాబు మైనస్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే గెలుపు కాస్తా ఓటమికి దారితీసింది. ఈ పరిణామాలతో ఇప్పుడు పార్టీని బతికించుకోవాల్సిన చారిత్రక పరిస్థితి బాబుకు ఎదురైంది.ఈ పరిస్థితు ల్లో ఆదివారం జరిగిన 38వ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని, ఊపును తెస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, దీనికి భిన్నంగా అత్యంత సాదాసీదాగా ఈ కార్యక్రమం ముగిసిపోయింది.
పార్టీ అధినేతగా చంద్రబాబు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్న పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగరేసి ఈ కార్యక్రమాన్ని ముగించారు. దీనికి పెద్దగా ఎలాంటి హడావుడీ చేయలేదు. అయితే, ఈ మొత్తం వ్యవహారం కూడా కేవలం రెండు గంటల్లోనే ముగిసిపోవడం కూడా గమనార్హం. నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినా కూడా చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ప్రభుత్వంపై నాలుగు విమర్శలు, స్వోత్కర్షలు తప్ప.. పార్టీని ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలో బాబు దిశానిర్దేశం చేయలేక పోయారు. తమ్ముళ్లు కూడా మొక్కుబడిగానే పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఇక, పార్టీ పరిస్థితి గురించి తెలిసిన సీనియర్లు.. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తాము ఊహించలేదని చెప్పుకొచ్చారు.