శీతాకాలంలో ఎక్కువగా పండించే పూల పంటలలో చామంతి ఒకటి..తేలికపాటి నేలలు, ఉదజని సూచిక 6.5 నుండి 7.0 మధ్య కలిగిన నేతలు అనుకూలంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి.సంవత్సరం మధ్యలో అంటే జూలై లో చామంతిని నాటుకోవాలి..నవంబర్, డిసెంబరు లేదా జనవరికి పూలు వస్తాయి.ఏడాది పొడవునా ఈ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పూలు కోయటం పూర్తయిన తరువాత ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మొక్కల కొమ్మలు కత్తిరించి ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూలు నాణ్యత బాగుంటుంది.
మొక్కలను 30 నుండి 20 సెం.మీ ఎడంలో నాటుకోవాలి. ఎకరానికి 60 వేల మొక్కలవరకు నాటుకోవచ్చు. నారు నాటిన నాలుగు వారాల తరువాత చామంతి మొక్కల తలలు తుంచుకోవాలి. ఇలా చేయటం వల్ల పెరుగుదల ఆగి పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీని వల్ల పూలదిగుబడి బాగా పెరుగుతుంది. 20 రోజులకోసారి క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలి..దాంతో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.మొక్కలు నాటిన 30 రోజుల మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి.
ఇకపోతే పూల సైజు బాగా పెరగాలంటే తలలు కత్తిరించిన 20 నుంచి 25 రోజులకు లీటర్ నీటిలో 50 పీపీఎం జిబ్బరెల్లిక్ ఆమ్లం కలిపి పిచికారీ చేయాలి. లియోసిన్ మందును పిచికారీ చేస్తే మొగ్గ సైజు పెరుగుతుంది..
తెగుళ్ళ నివారణ:
ఆకుమచ్చ తెగులు: ఆకులమీద వలయాకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వల్ల ఆకుల మీద ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి, చుట్టూ ఎరుపు వర్ణంతో మధ్యభాగం తెల్లగా ఉంటుంది. ఈ తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా.మంకోజెబ్ లేదా 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి 15రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు తెగులు : భూమిలో తేమ అధికంగా ఉన్నట్లయితే వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల లేత మొక్కలు అర్ధంతరంగా ఎండిపోతాయి. ఈ తెగులు నివారణ కోసం లీటర్ నీటిలో 3గ్రా.కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1గ్రా. కార్బెండజిమ్ కలిపి, తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి..
తామర పురుగులు, ఆకు పచ్చ పురుగులు కూడా ఆశించే అవకాశం కూడా ఉన్నాయి..వీటి నివారణ కోసం ఎకరానికి మలాథియాన్ 5 శాతం పొడి 8 కిలోలు లేదా క్వినాల్ఫాస్ పొడి 8 కిలోలు చల్లుకోవాలి. లేదా లీటర్ నీటిలో 2 మి.లీ. ఎండోసల్ఫాన్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి..అప్పుడు వీటి బెడద తక్కువగా ఉంటుంది.. ఇంకేదైనా సమస్యలు ఉంటే దగ్గరిలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..