చర్మం గురించి పట్టించుకోకుండా పోతే అది ముదిరి ముదిరి చివరికి చర్మ సమస్యలు తగ్గకుండాపోయే ప్రమాదం ఉంది. అందుకే శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం గురించి కొంచెమైనా పట్టించుకోవాలి. మీ రోజువారి అలవాట్లు చర్మానికి హాని చేసి అనవసరమైన చర్మ వ్యాధులను తీసుకొస్తాయని మీకు తెలియదు. అలాంటి అలవాట్లేమిటో తెలుసుకుని అనవసరమైన ఇబ్బందుల నుండి బయటపడదాం.
ప్రస్తుతం ముఖంపై మొటిమలు ఏర్పడానికి కారణమయ్యే రోజువారి అలవాట్లేమిటో తెలుసుకుందాం.
అధిక కార్బోహైడ్రేట్లు గల ఆహారం
పాల పదార్థాలు సహా ఇతర అధిక కార్బోహైడ్రేట్లు గల ఆహారాలను తీసుకోవడం ముఖంపై మొటిమలకు ఒక కారణం. జంక్ ఫుడ్, చిప్స్, చాక్లెట్, ఐస్ క్రీమ్ మొదలగునవి పక్కన పెట్టకపోతే ముఖంపై మొటిమలు విపరీతంగా తయారవుతాయి. వాటికి బదులు యాంటీఆక్సిడెంట్లు అధికంగా గల కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
కొన్ని రకాల మందులు
మీకున్న వ్యాధులకు వాడే మందులు మీ శరీరమ్లో హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడు ముఖంపై మొటిమలు వంటివి ఏర్పడతాయి. అందుకే మందులు వాడేటపుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
వర్కౌట్ చేసిన తర్వాత స్నానం చేయకపోవడం
వర్కౌట్ చేసేటపుడు బిగుతైన దుస్తులు ధరిస్తారు. దానివల్ల చెమట ఎక్కువగా వస్తుంది. ఇలా చెమట వచ్చినపుడు వర్కౌట్స్ పూర్తయ్యాక ఖచ్చితంగా స్నానం చేయాలి. లేదంటే బాక్టీరియా వృద్ధి చెంది మొటిమలు ఏర్పడతాయి.
సూర్యకాంతి
సూర్యకాంతిలో ఎక్కువగా తిరిగేవారిలోనూ మొటిమలు ఏర్పడతాయి. ఒకవేళ మీరు బయటకి వెళ్ళాల్సి వస్తే సన్ స్క్రీన్ లోషన్ మర్దన చేసుకోవడం తప్పనిసరి.
నిద్ర సరిగ్గా లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం
నిద్ర సరిగ్గా లేకపోతే ఆ తర్వాతి రోజు మొత్తం మైకం కమ్మినట్టుగా ఉంటుంది. దానివల్ల పనులు కూడా సరిగ్గా చేయలేరు. ఇంకా ముఖంలో చాలా మార్పులు వస్తాయి. అవి మొటిమలు కావచ్చు. ఉబ్బిపోవడం కావచ్చు. అలాగే సరైన వ్యాయామం ముఖంపై మొటిమలౌ రాకుండా చూసుకుంటుంది.