బిజినెస్‌ ఐడియా: పావు ఎకరం భూమి ఉన్నా చాలు.. ఈ సాగు చేసేయొచ్చు..!!

-

ఉద్యోగం పోతే..జీవితం పోయినట్లు కాదు.. బతకడానికి చాలాదార్లు ఉన్నాయి.. వాటిని వెతుక్కోవడమే లేట్‌.. కరోనా నుంచి ఈరోజు వరకూ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది.. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి.. కరోనా ఫస్ట్‌ లాక్‌డౌన్‌ అప్పుడు జాబ్స్‌ పోయి ఎంతమంది ఇబ్బందులు పడ్డారు.. పాఠాలు చెప్పిన మాస్టర్లు..రోడ్డుపక్కన అరటిపళ్లు, కూరగాయలు అమ్ముకున్నారు.. అదేటైమ్‌లో రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 41 ఏళ్ల రజా మహమ్మద్‌కు కూడా ఉద్యోగం పోయింది..ప్రైవేట్ స్కూల్‌లో ఆయన టీచర్‌గా పనిచేసేవారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడడంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయి.. రోడ్డున పడ్డారు. ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకపోయింది. చిరవకు ఓ వ్యక్తి ద్వారా ముత్యాల సాగు గురించి తెలుసుకున్నాడు. ఆయనకున్న 12 గుంటల భూమిలో ముత్యాల సాగును చేపట్టారు. కట్‌ చేస్తే..
ముత్యాల సాగు చేస్తే లాభాలు బాగా వస్తాయని మాత్రమే రజాకు తెలుసు. కానీ ముత్యాల సాగుకు గురించి ఆయనకు పెద్దగా అవగాహన లేదు. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ శిక్షణాకేంద్రమైన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెస్ వాటర్ అక్వాకల్చర్ (CIFA) మూసివేశారు. అప్పుడు జైపూర్‌కు చెందిన నరేంద్ర గర్వా వద్ద రెండు రోజులు శిక్ష తీసుకున్నారు రజా. నరేంద్ర గర్వాకు ముత్యాల సాగులో ఎంతో అనుభవం ఉంది. 2017 నుంచి ముత్యాలను సాగు చేస్తున్నారు. ఏటా 10 లక్షల మేర ఆయన సంపాదిస్తున్నారు. అవసరమైన వారికి శిక్షణ కూడా ఉచితంగా ఇస్తుంటారు. రజా మహమ్మద్ కూడా ముత్యాల సాగును చేపట్టారు.
రజా మహమ్మద్ 1000 ఆయెస్టర్‌లతో ముత్యాల పెంపకాన్ని ప్రారంభించారు. ఇందుకోసం రూ.50వేల పెట్టుబడి అవసరమైంది. ఒక్క ఆల్చిప్పకు సగటు ధర 10-12 రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. కేరళ , ముంబై, సూరత్‌లో ఈ ఆల్చిప్పలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఒక బ్యాచ్ ఆల్చిప్పలతో ముత్యాల తయారీకి దాదాపు 15-20 నెలలు పడుతుంది. ప్రారంభ దశలో 20-25 శాతం ఆల్చిప్పలు చెడిపోతాయి. చివరి దశకు వచ్చే సరికి 50 శాతం పెంకులు పాడవుతాయి. ఈ ప్రక్రియలో నష్టం కూడా ఉంటుంది. కానీ, మిగిలిన ఆల్చిప్పల్లో తయారైన ముత్యాలతో ఈ నష్టాన్ని భర్తీ చేయొచ్చు.. ఒక్కో ఆల్చిప్పలో రెండు నుంచి మూడు ముత్యాలు తయారవుతాయి. 50 శాతానికి పైగా ఆల్చిప్పలు చెడిపోయినప్పుడు.. నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆల్చిప్పలను ప్రతిరోజూ పరిశీలిస్తుండాలట… పీహెచ్, అమ్మోనియా స్థాయులను చెక్ చేయాలి. లేదంటే మరింత నష్టం జరిగే అవకాశముంది.
ఆల్చిప్పల్లో తయారైన ముత్యాల నాణ్యత బట్టే మార్కెట్లో రేటు లభిస్తుంది. గుండ్రని ముత్యాల ధర మార్కెట్లో డిజైన్ చేసిన ముత్యాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ గుండ్రి ముత్యాలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వస్తాయి. ఒక ఆల్చిప్పలో మూడు ముత్యాలు ఉంటే.. అందులో ఒకటి గుండ్రని ముత్యం ఉంటే.. మిగతా రెండు సాధారణమైనవి లభ్యమవుతాయి. ముత్యాల పెంపకం ద్వారా తన వార్షిక ఆదాయం 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉందని రజా తెలిపారు. దీనికి పెద్ద శ్రమ, సమయం అవసరం లేనందున.. ట్యూషన్స్ కూడా చెబుతున్నారట… ప్రస్తుతం 2వేల ఆయెస్టర్లతోనే ఆయన ముత్యాల సాగు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింత విస్తరిస్తానని…అప్పుడు మరింత లాభాలు వచ్చే అవకాశముందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news