కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే చాలు.. సాధారణంగా ఆ సినిమా యూనిట్‌కు చెందిన ఎవరైనా తమ సినిమాను దయచేసి థియేటర్లలోనే చూడాలని, పైరసీ చూడవద్దని చెబుతుంటారు. ఇది సర్వ సాధారణమే. సినీ రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పైరసీ ప్రధాన సమస్యగా మారింది. దీన్ని నివారించడం ఎలాగో సినీ పెద్దలకు, ప్రభుత్వాలకు తెలియడం లేదు. దీంతో కొత్త సినిమాను విడుదల చేసేటప్పుడు సాధారణంగానే సినీ నిర్మాత, దర్శకుడు, యాక్టర్లు తమ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని వేడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ దర్శకుడు మాత్రం తమ సినిమాను పైరసీలో చూడాలని వేడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
రిషి కపూర్, తాప్సీ, ప్రతీక్ బబ్బర్, అశుతోష్ రానాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ముల్క్. హిందూ, ముస్లింల మధ్య స్నేహానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను చిత్ర యూనిట్ పాకిస్థాన్‌లోనూ రిలీజ్ చేయాలని భావించింది. కానీ అందుకు అక్కడి సెన్సార్ బోర్డు ఒప్పుకోలేదు. ముల్క్ సినిమాపై ఆ బోర్డు నిషేధం విధించింది. దీంతో చిత్ర యూనిట్ విచారం వ్యక్తం చేసింది.
అయితే ముల్క్ దర్శకుడు అనుభవ్ సిన్హా మాత్రం తన సినిమా ఇక పాకిస్థాన్‌లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం లేకపోయేసరికి కనీసం ఆన్ని పైరసీలో అయినా చూడాలని పాకిస్థాన్ ప్రజలను కోరాడు. దీంతో ఈ విషయం అటు బాలీవుడ్‌తోపాటు మిగిలిన సినిమా ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమే అయింది. ఈ క్రమంలో అనుభవ్ సిన్హా మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రజలు తన సినిమాను కనీసం పైరసీలో అయినా చూడాలని, అప్పుడే వారికి అక్కడి బోర్డు తన సినిమాను ఎందుకు నిషేధించిందో అర్థమవుతుందని అన్నారు. అయితే సాక్షాత్తూ ఓ సినిమాకు దర్శకుడు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైరసీని ప్రోత్సహించడమేనని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.