గాడ్ ఫాద‌ర్ చిరు : మాట్లాడ‌క‌పోవ‌డమే సిస‌లు స‌మ‌స్యా?

చాలా రోజుల నుంచి న‌లుగుతున్న ఓ వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు కొలిక్కి వ‌చ్చే ఛాన్స్ ఉంది.వ‌కీల్ సాబ్ మొద‌లుకుని నిన్న‌మొన్న‌టి శ్యామ్ సింగ‌రాయ్ వ‌ర‌కూ సినిమాల‌కు సంబంధించి వివాదాలు వాటి ఆన‌వాళ్లు అలానే ఉన్నాయి.అయినా కూడా ఏపీ స‌ర్కారుతో స‌రిగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌క‌పోవ‌డం వ‌ల్లే ఇంత వ‌ర‌కూ స‌మ‌స్య ఉద్ధృతం అయి ఉంద‌ని చాలా మంది అంత‌ర్మ‌థ‌నం చెందుతూ వ‌చ్చారు.అస‌లు బాల‌య్య లాంటి వారు కూడా చొర‌వ తీసుకోలేదు.అఖండ సినిమా విష‌యంలో బాల‌య్య‌కు ఓవ‌ర్సీస్ మార్కెట్ క‌ల‌సి రావ‌డంతో కొంత వ‌ర‌కూ ఆర్థికంగా ఒడ్డెక్కారు నిర్మాత.

 

కానీ ఏపీ టికెటింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డి త‌రువాత ఇబ్బందులు ప‌డింది కూడా ప‌వ‌న్ క‌ల్యాణే కానీ ఇంకొక‌రు కాదు. ఇదే స‌మ‌యంలో మంత్రులు కూడా అదే స్థాయిలో ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసి సంద‌ర్భాన్ని త‌మ‌కు అనుగుణంగా మార్చుకునేందుకు తెగ ప్ర‌య‌త్నించారు. ఈ విధంగా ఎవ‌రి పంతానికి వారు పోయి ఇష్యూని తెగేదాకా లాగారు. కానీ ఇప్పుడు అదే ప్ర‌భుత్వం నుంచి చిరుకు సాద‌ర స్వాగ‌తం ద‌క్క‌డం శుభ ప‌రిణామం. జ‌గ‌న్ కూడా ఎంతో హుందాగా మాట్లాడి పంపారు. కొన్ని రోజుల్లో వీటిపై మంచి క్లారిఫికేష‌న్ వ‌స్తే చాలు ఇంకేమీ వ‌ద్దు అన్న విధంగా ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఉన్నారు.

యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో ఇవాళ చిరు భేటీ అయ్యారు. ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. కీల‌కంగా అనిపించిన కొన్ని విష‌యాలు ఇంత‌కాలం స్త‌బ్దుగా ఉన్న కొన్ని విష‌యాలు దాదాపు ప‌రిష్కారానికి నోచుకునేలానే ఉన్నాయ‌ని చిరు మాట‌ల ద్వారా అర్థం అవుతోంది. రెండు,మూడు వారాల్లో స‌మ‌స్య ప‌రిష్కారం కానుంద‌ని చిరు స్ప‌ష్టం చేశారు కూడా! త‌న‌దైన ఆశావ‌హ దృక్ప‌థంలో భాగంగా చాలా మంచి మాట‌లు ఇరు వ‌ర్గాలనూ నొప్పించ‌క తానొవ్వ‌క ప్ర‌వ‌ర్తించారు. దీంతో స‌మ‌స్య ఆఖ‌రి అంకంకు చేరుకుని రేపో మాపో ఓ స్ప‌ష్ట‌మైన ముగింపును తీసుకోనుంది.

ఇంత‌కాలం మాట్లాడ‌కే ఇంత స‌మ‌స్య వ‌చ్చిందా లేదా స‌మ‌స్య వ‌చ్చాక వీళ్లంతా క‌దులుతున్నారా అన్న సంశ‌యం ఉన్న‌ప్ప‌టికీ, చిరంజీవి చొర‌వ‌తో కాస్తో కూస్తో జ‌గ‌న్ కూడా సానుకూలంగానే ఉన్నార‌ని తేలింది. ఇండస్ట్రీ నుంచి అడుగులు వేసే వారు లేక‌, వేసే వాళ్లంతా ఓ అస్ప‌ష్ట వైఖ‌రితో ఉండ‌డంతోనే టికెట్ రేట్ల త‌గ్గింపున‌కు సంబంధించి ప్ర‌భుత్వం కొంత మొండి ప‌ట్టుద‌ల‌కు పోయింది.పేర్నినాని,కొడాలి నాని లాంటి మంత్రులు నోటికి వ‌చ్చిందంతా మాట్లాడి త‌గువు పెంచుకుంటూ పోయారు.